వేసవిలో తినదగిన అనేక రకాల ఆహారాల్లో గుల్కండ్ ఒకటి. దీన్ని గులాబీ పువ్వుల రేకులతో తయారు చేస్తారు. వేసవిలో దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. గుల్కండ్ సహజసిద్ధమైన కూలంట్. అంటే శరీరాన్ని చల్లగా ఉంచుతుందన్నమాట. అందుకని దీన్ని వేసవిలో రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
గుల్కండ్‌ను మార్కెట్‌లో అనేక కంపెనీలు విక్రయిస్తున్నాయి. అయితే దీన్ని ఇంట్లోనూ మీరు సహజసిద్ధంగా తయారు చేసుకోవచ్చు. అందుకు గాను గులాబీ పువ్వుల రేకులను సేకరించాలి. వాటిని శుభ్రమైన వస్త్రంపై పేర్చి ఎండలో ఎండబెట్టాలి. సగం ఎండాక వాటిని తీసి ఒక సీసాలో వేయాలి. ఒక పొర గులాబీ పువ్వుల రేకులు, ఒక పొర చక్కెర ఇలా సీసాలో వేస్తూ సీసాను నింపాలి. అనంతరం సీసాకు మూత పెట్టి దాన్ని మళ్లీ ఎండలో ఉంచాలి. అలా 21 రోజుల పాటు ఉంచితే గుల్కండ్ తయారవుతుంది. దాన్ని నిత్యం 1 టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు.
వేసవిలో సహజంగానే కొందరికి చర్మం పగులుతుంది. ఇంకొందరికి మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. కొందరికి విరేచనాలు అవుతాయి. కొందరికి జుట్టు కుదుళ్లు దురదలు పెడతాయి. ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. వాటన్నింటికీ గుల్కండ్ ఒక్కటే పరిష్కారం చూపుతుంది.
* గుల్కండ్‌ను తీసుకోవడం వల్ల అసిడిటీ, తలనొప్పి, అలసట, మలబద్దకం, గ్యాస్, పీసీవోఎస్, మొటిమలు, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి.
* రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలతో 1 టీస్పూన్ గుల్కండ్‌ను తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. శరీరం చల్లగా అవుతుంది.
* పగటిపూట గుల్కండ్‌ను తీసుకుంటే అసిడిటీ, గ్యాస్ తగ్గుతాయి.
* ఉదయాన్నే పరగడుపునే 1 టీస్పూన్ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తీపి తినాలనే యావ పోతుంది.
* తమలపాకుతో కలిపి దీన్ని 1 టీస్పూన్ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. శరీరం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకుంటుంది.