Dosakaya Pappu : దోసకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయలను తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా దోసకాయలు మనకు ఎంతో దోహదపడతాయి. దోసకాయలతో మనం పచ్చడి, పప్పు, కూర వంటి రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. దోసకాయలతో చేసే పప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. దోసకాయ పప్పును మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తరచూ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది ఇష్టపడే ఈ దోసకాయ పప్పును రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 100 గ్రా., తరిగిన దోసకాయ – 1, తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, నూనె – ఒక టేబుల్ స్పూన్.
దోసకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు, దోసకాయ ముక్కలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి. దీనిని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఉప్పు, కారం, పసుపు వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ పప్పును మరో 5 నిమిషాల పాటు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిగిలిన పదార్థాలన్నీ వేసి తాళింపు చేసుకోవాలి.
తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించిన పప్పు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే రోటి, చపాతీ, పుల్కా వంటి వాటితో కూడా ఈ దోసకాయ పప్పును తినవచ్చు. ఈ పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.