Head Bath : జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలని చాలా మంది ఎప్పుడుపడితే తలస్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అభ్యంగన స్నానాలు ఏ రోజు పడితే ఆ రోజు చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. తలస్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. స్త్రీలు బుధ, శుక్ర, శని వారాల్లో తలస్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు మిగతా రోజుల్లో తలస్నానం చేయడం అంత అనుకూలం కాదు.
చాలా మంది మంగళ, గురు వారాల్లో కూడా తలస్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ముందు రోజు రాత్రి తలస్నానం చేయాలి. పండగ రోజులు, పుణ్య దినాల్లో మాత్రం తలస్నానం చేయడానికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా పురుషులు శనివారం నాడు తలస్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది. పురుషులు శనివారం నాడు తలస్నానం చేసి ఇష్టదైవానికి పూజ చేసి దీపం పెట్టడం వల్ల వారి జీవితం చాలా శుభప్రదంగా ఉండడంతోపాటు అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి.
తలస్నానం విషయంలో ఒక్కో రోజుకు ఒక్కో ఫలితం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఆదివారం నాడు తలస్నానం చేస్తే తాపం తగ్గి ప్రశాంతత కలుగుతుంది. సోమవారం చేయడం వల్ల తేజస్సు వస్తుంది. మంగళవారం నాడు తలస్నానం చేయడం వల్ల మృత్యు భయం వెంటాడుతుంది. బుధవారం నాడు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. గురు వారం నాడు తలస్నానం చేయడం వల్ల ధనం సిద్ధిస్తుంది. శుక్రవారం అభ్యంగన స్నానం ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది.
శనివారం నాడు తలస్నానం చేయడం వల్ల భోగ భాగ్యాలు కలుగుతాయి. తలస్నానం ఎప్పుడూ సూర్యోదయానికి ముందే చేయాలి. కుంకుడుకాయ, షాంపూలతో మాత్రమే తలస్నానం చేయాలి. అవి అందుబాటులో లేకుంటే తలస్నానం చేయడం మానేయాలి తప్ప సాధారణ నీటితో తలస్నానం చేయకూడదు. తలకు కొబ్బరి నూనెను, విభూదిని రాసుకుని మాత్రమే అభ్యంగన స్నానం చేయాలి. స్త్రీలు బహిష్టు అయిపోగానే వెంటనే తలస్నానం చేయాలి. అదే విధంగా అశుభ కార్యాలకు వెళ్లి వచ్చిన తరువాత కూడా తలస్నానం చేయాలని మన శాస్త్రం చెబుతోంది.