Dosakaya Roti Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి. ఇది మనందరికీ తెలుసు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దోసకాయను తినడం వలన మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో దోసకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కూడా దోసకాయ సహాయపడుతుంది. దోసకాయలతో కూరను, పప్పునే కాకుండా ఎంతో రుచిగా ఉండే రోటి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దోసకాయలతో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన దోసకాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), పెద్దగా తరిగిన టమాట – 1, పచ్చి మిరపకాయలు – 10 నుండి 15 లేదా తగినన్ని, వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – 10 గ్రా., ఉప్పు – తగినంత.
దోసకాయ రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పచ్చి మిరపకాయలను, టమాట ముక్కలను వేసి వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో దోసకాయ ముక్కలను వేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు రోట్లో వేయించిన పల్లీలను వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత వేయించిన పచ్చిమిర్చి, టమాట ముక్కలున వేసి అందులోనే వెల్లుల్లి రెబ్బలను, చింతపండును, ఉప్పును వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత వేయించిన దోసకాయ ముక్కలను వేసి కచ్చా పచ్చా గా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ రోటి పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని రోలు అందుబాటులో లేని వారు జార్ లో కూడా వేసి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి తింటే రుచితోపాటు దోసకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.