Dosakaya Roti Pachadi : దోసకాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. దోసకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి. దోసకాయలతో మనం కూర, పులుసు, పప్పు వంటి వాటితో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే దోసకాయ పచ్చడిని రోట్లో వేసి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ రోటీ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన దోసకాయ – 1, తరిగిన టమాట – 1, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 3, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
దోసకాయ రోటీ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, టమాట వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో దోసకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత రోట్లో పల్లీలు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత టమాట, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి దంచుకోవాలి. తరువాత దోసకాయ ముక్కలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి అంతా కలిసేలా దంచుకుని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ రోటీ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని మనం జార్ లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన దోసకాయ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.