Moong Dal Halwa : మనం పెసరపప్పును కూడా ఆహారంగా తీసుకుంటాము. పెసరపప్పులో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో వివిధ రకాల కూరలను, పప్పును, సాంబార్ ను తయారు చేస్తూ ఉంటాం. కూరలే కాకుండా పెసరపప్పుతో తీపి వంటకాలు కూడా చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో మూంగ్ దాల్ హల్వా కూడా ఒకటి. మూంగ్ దాల్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, కమ్మగా ఉండే మూంగ్ దాల్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మూంగ్ దాల్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – పావుకిలో, పంచదార – పావు కిలో, నీళ్లు – 100 ఎమ్ ఎల్, నెయ్యి – పావుకిలో, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన బాదం పప్పు – 6.
మూంగ్ దాల్ హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసి పావు కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు దీనిని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే మరో కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పెసరపప్పు వేసి వేయించాలి. పెసరపప్పు అడుగు అంట్టకుండా దీనిని కలుపుతూనే ఉండాలి. దీనిని 45 నిమిషాల పాటు వేయించిన తరువాత నెయ్యి పైకి తేలుతుంది.
ఇలా నెయ్యి పైకి తేలగానే పంచదార మిశ్రమం, యాలకుల పొడి వేసి పెద్ద మంటపై కలుపుతూనే ఉండాలి. హల్వా గట్టిపడి నెయ్యి పైకి తేలిన తరువాత బాదం పప్పు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మూంగ్ దాల్ హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు ఇలా పెసరపప్పుతో హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ హల్వాను లొట్టలేసుకుంటూ ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.