Wheat Rava Kichadi : కిచిడీ అంటే సాధారణంగా మనం అన్నంతో చేసుకుంటాం. వివిధ రకాల కూరగాయలు చేసి వండే కిచిడీని టమాటా రసం లేదా ఆలు కూరతో తింటాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు కనుక ఇతర మార్గాల్లో వారు కిచిడీని చేసుకుని తినాలి. ఈ క్రమంలోనే గోధుమ రవ్వతో చేసే కిచిడీని వారు తినవచ్చు. దీన్ని వారే కాదు.. ఇతరులు ఎవరైనా సరే తినవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరం. రుచిగా వండితే దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. అనేక పోషకాలు కూడా లభిస్తాయి. ఇక గోధుమరవ్వతో కిచిడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమరవ్వ – ఒకటిన్నర కప్పు, పెసర పప్పు – పావు కప్పు, అల్లం తరుగు – అర టీస్పూన్, లవంగాలు – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, యాలకులు – రెండు, ఎండు మిర్చి – రెండు, పచ్చి మిర్చి – రెండు, నెయ్యి – పావు కప్పు, ఆవాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉల్లిపాయ – ఒకటి, టమాటా – ఒకటి, పచ్చి బఠానీ – అర కప్పు, క్యారెట్ – ఒకటి, బంగాళా దుంపలు – రెండు, బీన్స్ – ఐదు, ఉప్పు – తగినంత, పసుపు – అరటీస్పూన్, కారం – పావు టీస్పూన్.
గోధుమరవ్వ కిచిడీని తయారు చేసే విధానం..
కుక్కర్ని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించాలి. అందులోనే పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. నిమిషం అయ్యాక కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా వేయించాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి పెసరపప్పు, గోధుమ రవ్వ వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. వడ్డించే ముందు దీనిపై కొద్దిగా నెయ్యి వేస్తే చాలు. వేడి వేడి గోధుమ రవ్వ కిచిడీ సిద్ధమవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా కూర, రసంతోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.