Veg Pakora : పకోడీలు.. వీటి పేరు చెప్పగానే కొందరికి ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా చాలా మంది ఉల్లిపాయలతో పకోడీలను చేస్తారు. కానీ ఆకుకూరలతోనూ పకోడీలను చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆకుకూరలతో పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరల పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు – ఒక కప్పు, మెంతి ఆకులు – ఒక కప్పు, తోట కూర – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు, పచ్చి మిర్చి మిశ్రమం – రెండు టీస్పూన్లు, కారం – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – అర కప్పు, కరివేపాకు రెబ్బలు – కొన్ని, నూనె – వేయించడానికి సరిపడా, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు.
ఆకుకూరల పకోడీలను తయారు చేసే విధానం..
ముందుగా మునగాకు, మెంతి ఆకులు, తోటకూర, కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఒకవేళ పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పిండిని పకోడీల్లా వేసుకోవాలి. మంట తగ్గించి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి రుచిగా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి.